రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్ LED స్క్రీన్‌పైనే రాజరాజేశ్వరుడి దర్శనం
వేములవాడ, నవంబర్ 12 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చగా, ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు భాగంలోని స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్‌ను ఏర్పాటు చేసి, అందులో స్వామివారి దర్శనం చూపిస్తున్నారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా గత నెల రోజులుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు, నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దక్షిణం, ఉత్తర ప్రాకారాలతో పాటు పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఈవో కార్యాలయాన్ని తొలగించారు.
ఇక భీమన్నగుడిలో మాత్రం భక్తుల దర్శనాలు, కోడె మొక్కు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి అయ్యే వరకు రాజన్న దర్శనం ఎల్ఈడి స్క్రీన్ ద్వారానే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

Post a Comment