ఇస్లాంలో మానవ హక్కుల రక్షణ కవచం – ఖాజీ ఇస్మాయిల్ నిజామీ

ఇస్లాంలో మానవ హక్కుల రక్షణ కవచం Human Rights Day సందర్భంగా గోదావరిఖనిలో అవగాహన సదస్సు


గోదావరిఖని – డిసెంబర్ 10: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జమాత్ ఏ ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు, టెమ్రీస్ కౌన్సిలర్, హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి ఖాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “టెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా జాతి వివక్ష, అసమానతలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మానవ హక్కులపై మాట్లాడాల్సిన అవసరం ఇప్పటివరకు ఎప్పుడూ ఇంత తీవ్రంగా లేదు” అని అన్నారు.

ఇస్లాంలో మానవ హక్కుల భావన విశాలమైనది

ఖాజీ ఇస్మాయిల్ నిజామీ మాట్లాడుతూ ఇస్లాంలో మానవ హక్కులు కేవలం సామాజిక ఒప్పందాలపై ఆధారపడలేదని, దైవ ఆజ్ఞలుగా ఇచ్చిన పవిత్ర హక్కులుగా భావించబడతాయని వివరించారు. ఖురాన్‌లో ఉన్న మానవ హక్కుల సారాంశాన్ని వివరిస్తూ —

  • న్యాయం, ఉపకారం, బంధుత్వ హక్కులు గౌరవించాలన్న ఆదేశం (ఖురాన్ 16:90)
  • మానవులందరూ సమానమే, రంగు – కులం – జాతి ఆధారంగా ఎలాంటి అధిక్యత లేదని (ఖురాన్ 49:13) స్పష్టంగా పేర్కొన్నారు.

జాతి వివక్షకు ఇస్లాంలో స్థానం లేదు

ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ.) హజ్జ్ వేదనలో చెప్పిన సందేశాన్ని గుర్తు చేస్తూ “ఒక అరబ్బుకు అరబ్బేతరుడిపై గానీ, నల్లవానికి తెల్లవాడిపై గానీ ఎలాంటి అధిక్యత లేదు. మీరందరూ ఆదమ్ సంతానమే” అని చెప్పారు.

స్త్రీ సమానత్వం – జీవించే హక్కు – విశ్వాస స్వేచ్ఛ

ఇస్లాంలో—

  • స్త్రీలకు పురుషులతో సమాన ఆధ్యాత్మిక హక్కులు ఉన్నాయి
  • ఆస్తి సంపాదన, వ్యాపారం, విద్య, ఓటు హక్కు కల్పించబడింది
  • ప్రాణం పవిత్రమైనదని, ఒక ప్రాణం కాపాడటం అంటే మొత్తం మానవాళిని కాపాడినట్లేనని (ఖురాన్ 5:32)
  • యుద్ధ సమయంలో కూడా స్త్రీలు, పిల్లలు, వృద్ధుల ప్రాణ రక్షణకు ఆదేశాలు ఉన్నాయన్నారు. అలాగే, విశ్వాస స్వేచ్ఛను గౌరవించే ధర్మమే ఇస్లాం అని పేర్కొంటూ, స్పెయిన్‌లోని కార్డోబా నగరం ఒకప్పుడు మత సామరస్యం, విజ్ఞాన కేంద్రంగా నిలిచిందని గుర్తు చేశారు.

పేదల హక్కులు – న్యాయం – పరస్పర బాధ్యత

  • పేదలకు ఆహారం, ఆశ్రయం, వైద్య సేవలు అందించడం సమాజ బాధ్యత
  • సంపదలో పేదలకూ హక్కు ఉందని ఖురాన్ స్పష్టంగా చెబుతోందని తెలిపారు.
  • మతం, జాతి, శత్రుత్వం ఏమున్నా న్యాయం చేయాల్సిందే అన్న సిద్ధాంతమే ఇస్లాం మూలాధారం అని వివరించారు.

ప్రజల భాగస్వామ్యం

ఈ కార్యక్రమానికి జమాత్ ఏ ఇస్లామీ హింద్ గోదావరిఖని అధ్యక్షులు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, ఫసియుద్దీన్, ముస్తఫా, అక్బర్, మక్సూద్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పాషా, ఖాజా మొయినుద్దీన్, జుబేర్ అహ్మద్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.