సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడి ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మహిళ మృతి
జగిత్యాల జిల్లా, కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడి ఓటమిని తట్టుకోలేక ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కొక్కుల మమత (38) ప్రస్తుతం కోరుట్లలో నివాసం ఉంటోంది. తన తమ్ముడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ప్రచార కార్యక్రమాల కోసం ఆమె గంభీర్పూర్ గ్రామానికి వెళ్లింది. మమత తమ్ముడు, గ్రామ మాజీ సర్పంచ్ అయిన పోతు రాజశేఖర్, మరోసారి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు.
ఎన్నికల ఫలితాల్లో స్వల్ప తేడాతో రాజశేఖర్ ఓడిపోవడంతో మమత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే దారి మధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మమత భర్త ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్నారు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ అనూహ్య ఘటనతో మమత కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Post a Comment