ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 40 మంది విద్యార్థులు అస్వస్థత – ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్, డిసెంబర్ 13: మాదాపూర్ చందానాయక్ తండాలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం సుమారు 40 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. అస్వస్థతకు గురైన వారిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం నానక్‌రామ్‌గూడలోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు, స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్న భోజనంలో ఉపయోగించిన ఆహార నమూనాలను సేకరించి పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, భోజన నాణ్యతపై పర్యవేక్షణ మరింత కఠినంగా చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Post a Comment