సోషల్ మీడియా నెటిజన్లకు పోలీసుల హెచ్చరికలు

సోషల్ మీడియా నెటిజన్లకు పోలీసుల హెచ్చరికలు ఫేక్ వార్తల ప్రచారంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక


నేటి డిజిటల్ యుగంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు సోషల్ మీడియా మన జీవితంలో భాగమైపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా అనేక సందేశాలు, వార్తలు అందుతున్నాయి. వాటిలో కొన్ని నిజమైనవైనా, మరికొన్ని పూర్తిగా అసత్యమైనవిగా మారుతున్నాయి. అయితే చాలా సందర్భాల్లో ఆ మెసేజ్‌లను ఫార్వర్డ్ చేసే ముందు వాటి నిజానిజాలు పరిశీలించకుండా నెటిజన్లు వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

“నిజం గడప దాటేలోగా అసత్యం ప్రపంచాన్ని చుట్టేస్తుంది” అన్న సామెత నేటి సోషల్ మీడియా పరిస్థితికి అక్షరాలా సరిపోతుందని హైదరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో నిజ వార్తల కంటే ఫేక్ వార్తలే విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని, వాటి వల్ల సమాజంలో అపోహలు, భయాందోళనలు ఏర్పడుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.

అసత్య వార్తల ప్రభావంతో మహిళలు, పిల్లలు తీవ్ర మానసిక వేధింపులకు గురవుతున్నారని, కొంత కంటెంట్ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉంటోందని హైదరాబాద్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నెటిజన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచిస్తూ పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు.

నెటిజన్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన సూచనలు:

మీరు రాసే లేదా ఫార్వర్డ్ చేసే వార్త నిజమా కాదా అన్నది ముందుగా నిర్ధారించుకోండి. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల్లో బాధ్యతగా వ్యవహరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. తప్పుడు వార్తలను ప్రచారం చేసి అనవసరంగా చిక్కుల్లో పడవద్దు. ఫేక్ ప్రచారంలో భాగస్వాములు కావడం వల్ల మీ ప్రతిష్ఠకు భంగం కలగవచ్చని గుర్తుంచుకోండి.

సెన్సేషనలిజం కోసం అసత్య వార్తలను షేర్ చేస్తూ నవ్వులపాలు కావద్దని, అలాగే నెటిజన్ల ఆగ్రహానికి గురికాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించారు. ఫేక్ వార్తల ప్రచారాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని సూచించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.