జాతీయ లోక్ అదాలత్ విజయవంతం జిల్లా వ్యాప్తంగా 7,233 కేసులు పరిష్కారం
కొత్తగూడెం, డిసెంబర్ 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ అత్యంత విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. జిల్లా లోని అన్ని కోర్టుల పరిధిలో మొత్తం 7,233 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా కక్షిదారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలను ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసారి జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
కేసుల పరిష్కారానికి సహకరించిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కొనియాడారు. రాజీ మార్గంలో వివాదాలను పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డులు అందజేసి అభినందనలు తెలిపారు.

Post a Comment