జి రామ్ జి బిల్లును ఉపసంహరించుకోవాలి సుజాతనగర్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా
సుజాతనగర్, డిసెంబర్ 21 : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జి రామ్ జి బిల్లును ప్రవేశపెడుతోందని, వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సుజాతనగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పథక స్వరూపాన్ని మార్చి, అనేక మార్పులు చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
జి రామ్ జి బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ లింగం పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నర్రా అజయ్, వజ్జా శ్రీను, రాందాస్, నాగేశ్వరావు, యువజన కాంగ్రెస్ నాయకులు అబీద్, కోటేష్, గ్రామ సర్పంచులు కిన్నెర వెంకన్న, వజ్జా రామారావు, శ్రీకాంత్, నాగమణి, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment