హనుమకొండ: ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన
విద్యా సంవత్సరం ప్రారంభమై సంవత్సరం గడుస్తున్నా ఒక్క క్లాస్ కూడా జరగలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సమీపిస్తున్నా అధ్యాపకులు నియమించకపోవడం వల్ల తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళనకారులు తెలిపారు.
“ఫాకల్టీని వెంటనే నియమించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని వారు ఆరోపించారు.
విద్యార్థులు రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టడంతో పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.

Post a Comment