గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (GIO) – గోదావరిఖని యూనిట్ నూతన కార్యవర్గ నిదా తౌసిక్ అధ్యక్షురాలిగా ఎన్నిక
గోదావరిఖని: బాలికల ఇస్లామీ సంస్థ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (GIO) – జమాత్ ఇ ఇస్లామీ హింద్, గోదావరిఖని యూనిట్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి (ఒక సంవత్సరం కాలపరిమితి) నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమం గోదావరిఖని యూనిట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ఈ ఎన్నికల్లో నిదా తౌసిక్ గారిని గోదావరిఖని యూనిట్ అధ్యక్షురాలిగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే నూతన కార్యవర్గంలో బాజిగా తహ్రీమ్ – యూనిట్ సెక్రటరీగా, సుమయ్య అంజుం – దావా (సందేశ) కోఆర్డినేటర్‌గా, షగుఫ్తా అంజుమ్ – క్యాంపస్ ఆర్గనైజర్‌గా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో జమాత్ ఇ ఇస్లామీ హింద్ గోదావరిఖని ఉపాధ్యక్షుడు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, మహిళా విభాగం శిక్షణ కార్యదర్శి మరియు టెమ్రీస్ కౌన్సెలర్ శ్రీమతి ఆయిషా సిద్ధిఖ పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. GIO సభ్యుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది.
ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు సాజిదా నూతన అధ్యక్షురాలు నిదా తౌసిక్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, GIO రాజ్యాంగం – నిబంధనావళి, ఆర్టికల్ 3 ప్రకారం సంస్థ లక్ష్యాలు, ఉద్దేశ్యాలను వివరించారు.
GIO లక్ష్యాలు & ఉద్దేశ్యాలు:
దైవిక మార్గదర్శకత్వం వెలుగులో సమాజ పునర్నిర్మాణానికి మహిళా విద్యార్థినులు, యువతులను సిద్ధం చేయడం. మహిళా విద్యార్థినులు మరియు యువతుల్లో ఇస్లాం (దీన్) పై నిజమైన జ్ఞానం, అవగాహనను పెంపొందించడం.
ఖురాన్, సున్నహ్ ప్రకారం వ్యక్తిగత మరియు సామూహిక జీవితాలను నడిపించేలా వారికి మార్గనిర్దేశం చేయడం. సద్గుణాల ప్రోత్సాహం (అమర్ బిల్ మారూఫ్), దుష్కార్యాల నిర్మూలన (నహీ అనిల్ మున్కర్) కోసం సమాజాన్ని చైతన్యపరచడం. మహిళల సమగ్ర అభివృద్ధిని సాధించి, ఇస్లాం ప్రసాదించిన హక్కులు ఆచరణలో అందేలా చూడడం.
విద్యా వ్యవస్థలో నైతిక విలువలను పెంపొందించి, విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన అకాడమిక్ వాతావరణాన్ని నిర్మించడం. సంస్థతో పని చేసే కార్యకర్తల ప్రతిభను అభివృద్ధి చేసి, ఇస్లామిక్ ఉద్యమానికి విలువైన ఆస్తిగా తీర్చిదిద్దడం. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, నూతన కార్యవర్గం సమాజ సేవలో చురుకుగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Post a Comment