అడవి జంతువుల వేట కోసం పెట్టిన నాటు బాంబును కొరికి కుక్క మృతి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం | డిసెంబర్ 03, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఉల్లిగడ్డ ఆకారంలో తయారు చేసిన నాటుబాంబును కొరికి ఓ కుక్క అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారికంగా వివరాలు వెల్లడించారు.
రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త పడేసే స్థలం నుంచి ఒక కుక్క తినే పదార్థంగా భావించి, అడవి జంతువులను వేటాడేందుకు తయారు చేసిన నాటుబాంబును నోటితో కొరికిన సమయంలో అది ప్రేలడంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
నాటుబాంబులను చెత్తలో పడేసిన వ్యక్తుల ఆచూకీ కోసం ప్రత్యేక విచారణ చేపట్టామని, బాధ్యులను తప్పనిసరిగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి మరెలాంటి అనుమానాస్పద కోణాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలను ఎస్పీ రోహిత్ రాజు కోరారు. అధికారికంగా ఇచ్చే సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు. ఎవరైనా బాధ్యతారాహిత్యంగా తప్పుడు పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Post a Comment