ఫుడ్ పాయిజన్‌తో గురుకుల మరో విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఆహార భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురైన ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన సాయి లిఖిత (14) ఈ నెల 5వ తేదీన పాఠశాలలో భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
వైద్యుల సమాచారం ప్రకారం, లిఖితకు ఇప్పటికే జాండిస్ సమస్య ఉండటంతో ఫుడ్ పాయిజన్ ప్రభావం మరింత తీవ్రమైంది. గత కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె, మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది.
పొట్టకూటి కోసం కష్టపడి జీవనం సాగిస్తున్న లిఖిత తల్లిదండ్రులు లింగం, లక్ష్మీలు కుమార్తె మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కసారిగా ఇంటి దీపం ఆరిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురుకుల పాఠశాలల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది.

Post a Comment