సిపిఐ 2026 సభ్యత్వం నమోదు సదాశివపేటలో ఘనంగా కార్యక్రమం ప్రారంభం
సదాశివపేట: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 2026 నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు సదాశివపేటలోని సిపిఐ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం. తాజుద్దీన్ మాట్లాడుతూ, దేశంలో సిపిఐ పార్టీ స్థాపించబడిన నాటి నుంచి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో, సదాశివపేట మండలంలో గత సంవత్సరాల కంటే అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సిపిఐ పార్టీ వంద సంవత్సరాలుగా దేశంలో సజీవంగా కొనసాగుతోందంటే, అది పేదల ఆశీస్సుల వల్లేనని ఆయన అన్నారు. “పేదలు ఎక్కడ ఉంటారో, సిపిఐ అక్కడే ఉంటుంది. నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే పార్టీ సిపిఐ” అని స్పష్టం చేశారు.
పార్టీ వందేళ్ల చరిత్రను గౌరవిస్తూ, ఈ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించి సిపిఐ సత్తాను చాటాలని, 2026 సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేర్పించాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం. గంగమ్మ, పూలమ్మ, సరస్వతీ, ముస్తఫా, శివాలిల, రహిమ్, వహీదా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment