రోడ్డు భద్రతా నియమాలు తూచ తప్పకుండా పాటించాలి : తూప్రాన్ సీఐ రంగకృష్ణ
మెదక్, తూప్రాన్ — రోడ్డు భద్రతా మాసం సందర్బంగా తూప్రాన్ పట్టణంలో “అరైవ్ అలైవ్” పేరుతో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని తూప్రాన్ పోలీసులు నిర్వహించారు. సీఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఎస్ఐలు జ్యోతి, యాదగిరి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఐ రంగకృష్ణ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా పాటించడం తమ బాధ్యతగా భావించాలని సూచించారు. ద్విచక్రవాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ఉపయోగించడం వంటి అంశాలపై ప్రజలకు వివరణాత్మకంగా అవగాహన కల్పించారు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తాము మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా అధిక వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నళ్లను లెక్క చేయకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని చెప్పారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన కొంతమంది బాధితులు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ప్రమాదాల తర్వాత ఎదుర్కొన్న శారీరక, ఆర్థిక, మానసిక ఇబ్బందులను వివరించి రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేశారు. వారి కథలు అక్కడికి హాజరైన వారిపై విశేషమైన ప్రభావం చూపాయి.
ప్రమాదాల వల్ల కుటుంబాలపై పడే మానసిక వేదన, ఆర్థిక భారం గురించి ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు, ప్రతి ఒక్కరూ రోడ్డు మీద బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే బాధ్యత అందరిదని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు.
తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Post a Comment