మెట్రో స్టేషన్ సమీపంలో మాంజా వల్ల మరో వ్యక్తి మెడకు గాయం
హైదరాబాద్‌లో మళ్లీ మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి మెడకు మాంజా చిక్కుకుని లోతైన గాయం అయింది. ఆకస్మికంగా మాంజా తగలడంతో ఆయన బైక్‌పై నియంత్రణ కోల్పోయి తీవ్ర బాధను అనుభవించినట్లు తెలిపారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన సాయివర్ధన్ రెడ్డిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తుండగా, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
సంక్రాంతి వేడుకల సమయంలో కైట్ ఫ్లయింగ్‌లో ఉపయోగించే మాంజా దారాల వల్ల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ చైనా మాంజా, లోహపు పూత ఉన్న దారాలు పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాంజా వల్ల పక్షులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Post a Comment