ఓటు విలువను గుర్తించాలి… నోటుకు ఓటు వద్దు : షేక్ అబ్దుల్ బాసిత్

 

ఓటు విలువను గుర్తించాలి… నోటుకు ఓటు వద్దు : షేక్ అబ్దుల్ బాసిత్

కొత్తగూడెం | వెబ్‌డెస్క్: రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు విలువను గుర్తించి, డబ్బు, మందు, విందుల ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొత్తగూడెంకు చెందిన సామాజికవేత్త షేక్ అబ్దుల్ బాసిత్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకనైనా ప్రజలు మారి తమ తలరాతలను తామే మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు ఈరోజే పునాది వేయాలని సూచించారు. నోటుకు ఓటు అనే దుష్ప్రవర్తనను పూర్తిగా తిరస్కరించాలని, మద్యం–విందుల మాయకు దూరంగా ఉండాలని కోరారు.

“నా పార్టీ, నా కులపోడు, మా ఊరోడు” అనే సంకుచిత భావనను వదిలి, నీతిపరులకు, నిజాయితీగల అభ్యర్థులకు పట్టం కట్టాలని ఆయన సూచించారు. రాజకీయాలు అంటేనే అవినీతి అనే అపోహను దూరం చేసి, ప్రజాసేవే రాజకీయాల అసలైన లక్ష్యమనే నిజాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు.

యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, డబ్బులు ఉంటేనే గెలుపు అనే భ్రమను వీడి, నీతిగా, నిజాయితీగా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు విజయం సాధించకపోయినా రేపు తప్పకుండా గెలుపు సాధించవచ్చని అన్నారు.

పేరున్న పార్టీల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేసి గెలిచాక అక్రమ మార్గాల్లో సంపాదించవచ్చనే ఆలోచన పూర్తిగా తప్పని ఆయన హెచ్చరించారు. గెలుపు–ఓటములు పైవాడి చేతిలోనే ఉంటాయని, గెలిచాక ఎంతకాలం పదవిలో ఉంటామో ఎవరికీ తెలియదని గుర్తు చేశారు.

అలాగే మేధావులు, నిజాయితీ గల వ్యక్తులు మంచి కోసం పోటీకి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల నిర్వాహకులు కూడా సమాజంలో నీతి, న్యాయం, ధర్మం, శాంతి, సామరస్యాలను పెంపొందించేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు.

కేవలం ప్రార్థనలు చేస్తేనే మార్పు రాదని, మంచి వారిని చట్టసభలకు పంపే ప్రక్రియ ప్రజల నుంచే ప్రారంభం కావాలని షేక్ అబ్దుల్ బాసిత్ స్పష్టం చేశారు. జీవితంలో తీసుకువచ్చింది ఏమీ లేదని, వెళ్లేటప్పుడు తీసుకుపోయేదీ ఏమీ లేదని గుర్తించి, నలుగురికి మంచి చేసే విధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Blogger ఆధారితం.