టెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 : జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలకమైన పరీక్షలని, వాటిని పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించబడుతున్నందున, అన్ని పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు, సాంకేతిక సదుపాయాలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రత్యేక టెక్నికల్ సిబ్బందిని నియమించామని తెలిపారు.
అభ్యర్థులకు కీలక సూచనలు
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి పది నిమిషాల ముందే గేట్లు మూసివేయబడతాయని, అనంతరం ఎవరికీ ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.
అభ్యర్థులు తప్పనిసరిగా
హాల్ టికెట్
ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఫోటో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ తదితరాలు)
తీసుకురావాలని తెలిపారు. వీటిని కఠినంగా పరిశీలించిన అనంతరమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.
నిషేధిత వస్తువులు
పరీక్ష కేంద్రాల్లో
మొబైల్ ఫోన్లు
స్మార్ట్ వాచ్‌లు
కాలిక్యులేటర్లు
ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు
పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత వస్తువులకు తామే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
పరీక్ష విధానం
అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని ముందుగానే తెలుసుకోవాలని, పరీక్ష ప్రారంభానికి ముందు సిబ్బంది ప్రశ్నాపత్రం విధానం, సమాధానాలు నమోదు చేసే పద్ధతిని పూర్తిగా వివరించనున్నారని తెలిపారు. పరీక్ష సమయంలో అధికారుల సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరారు.
ప్రవేశ సమయాలు
ఉదయం సెషన్: 7.30 గంటల నుంచి 8.50 గంటల వరకు
మధ్యాహ్నం సెషన్: 12.30 గంటల నుంచి 1.50 గంటల వరకు
ఉదయం సెషన్ అభ్యర్థులను 11.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులను 4.30 గంటలకు మాత్రమే పరీక్ష పూర్తయిన తర్వాత బయటకు పంపుతామని తెలిపారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరికీ బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదన్నారు.
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందుగానే గుర్తించుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.

Post a Comment