స్కూల్ బస్సు కాల్వలో బోల్తా – 40 మందికిపైగా విద్యార్థులకు గాయాలు

 

స్కూల్ బస్సు కాల్వలో బోల్తా – 40 మందికిపైగా విద్యార్థులకు గాయాలు

ఖమ్మం జిల్లా, పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్పాడు గ్రామ శివారులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయంకు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.

పాఠశాల నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో బయలుదేరిన బస్సు గణేశ్పాడు, ఎల్‌ఎస్ బంజరు, కేఎం బంజరు, మార్లకుంట, ముత్తుగూడెం తదితర గ్రామాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గణేశ్పాడు గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ అతి వేగంగా బస్సును నడపడం వల్ల నియంత్రణ తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి బస్సు పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీఎం బంజరు పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన విద్యార్థులను పెనుబల్లి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి తీవ్రమైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కూల్ బస్సుల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.