శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత

రూ.9.5 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం


హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఛేదించారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.9.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

నిఘా వర్గాల సమాచారం మేరకు, బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగుల్లో డ్రగ్స్‌ను దాచినట్టు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు విదేశీ ప్రయాణికులతో పాటు స్థానికంగా సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక విచారణలో, ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలకు సరఫరా చేయాలన్న ఉద్దేశంతో అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, నిందితులను కోర్టులో హాజరుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, విమానాశ్రయాల్లో నిఘా మరింత పెంచామని DRI అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.