ఏప్రిల్ 5 లేదా 6న ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 5 లేదా 6 తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై మార్చి 17తో ముగియనున్నాయి. పరీక్షలు మొదలైన మరుసటి రోజే, అంటే ఫిబ్రవరి 26 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని చేపట్టాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఈసారి మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీజీజీ (CGG) సహకారంతో ఆన్‌లైన్ స్టాఫ్ పోర్టల్‌ను ప్రవేశపెట్టారు.
ఈ పోర్టల్‌లో 41 వేల మంది అధ్యాపకుల వివరాలు నమోదు చేయగా, వాటి ఆధారంగానే మూల్యాంకన విధులను కేటాయించనున్నారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 6 నుంచి నిర్వహించనున్నారు. అనంతరం సుమారు 20 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేసి, మే నెలాఖరులో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 1 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే పరీక్షలు, ఫలితాలు పూర్తిచేసి విద్యాపరమైన అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 2 నుంచి 21 వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. తొలిసారిగా జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టామని, ఒక కాలేజీ విద్యార్థులకు మరో కాలేజీలో పరీక్షా కేంద్రాలు కేటాయించామని తెలిపారు.
ఈ ప్రాక్టికల్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.20 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇందుకోసం 1,440 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Post a Comment