రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సంపద – వారిని మరిచిన వారికి భవిష్యత్తు ఉండదు

రిటైర్డ్ ఉద్యోగుల సదస్సులో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్బోధ


కొత్తగూడెం, జనవరి 27: రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి అమూల్యమైన సంపదని, వారి సేవలను మరిచిన సమాజానికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండదని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కమ్మ సేవా సమితి భవనంలో TSGREA భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో, కొత్తగూడెం మరియు చుంచుపల్లి యూనిట్లు సంయుక్తంగా నిర్వహించిన పెన్షనర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈజీఆర్ వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విడుదల కోసం ఇప్పటికే తనవంతు ప్రయత్నం చేశానని తెలిపారు.

పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించే ఆరోగ్య కార్డులు, జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని, సమస్యలను ధృడనిశ్చయంతో ఎదుర్కొంటూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి డిప్యూటీ డైరెక్టర్ జె. మీనాక్షి, ఏటీఓ ఎం. వెంకటేశ్వరరావు, సీనియర్ అకౌంటెంట్ బి. విజయ్ కుమార్, TGEJAC చైర్మన్ ఏ. రామారావు, కన్వీనర్ ఎస్. వెంకట పుల్లయ్య పాల్గొన్నారు.

అలాగే ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వేణు, జిల్లా నాయకులు ఎస్. వెంకటపతి రాజు, TSGREA చుంచుపల్లి యూనిట్ అధ్యక్షులు ఏ. పాపయ్య, కొత్తగూడెం (హెచ్‌క్యూఆర్‌ఎస్) అధ్యక్షులు ఎల్. రాములు తదితరులు ప్రసంగించారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కోటేశ్వరరావు కార్యక్రమ నివేదికను ప్రవేశపెట్టగా, జిల్లాలోని 10 యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.