వలపు వలలో వంద మందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్
కరీంనగర్: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వలపు వల వేసి వంద మందికి పైగా బాధితులను మోసం చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
గత రెండు సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణ పరిధిలోని ఆరేపల్లిలో ఉన్న శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న భార్యాభర్తలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ఫోటోలు పోస్ట్ చేస్తూ యువకులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని వల వేస్తున్నారని పోలీసులు తెలిపారు.
వలలో పడిన బాధితులను అపార్ట్‌మెంట్‌కు రప్పించి, మహిళతో ఉన్న సమయంలో భర్త వీడియోలు, ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసేవారని విచారణలో వెల్లడైంది.
ఈ అక్రమ వసూళ్లతో వారు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేయడంతో పాటు, విలాసవంతమైన జీవితం గడుపుతూ కారు ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇప్పటివరకు దాదాపు వంద మందికి పైగా వ్యక్తులను ఈ దోపిడీకి గురి చేసినట్లు సమాచారం. ఇదే తరహా బ్లాక్‌మెయిల్‌కు గురైన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, బుధవారం ఉదయం దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి ఒక కారు, నగ్న వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులు మంచిర్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

Post a Comment