కన్నీటి చుక్కలో దాగున్న సామ్రాజ్యం – సూరా అస్-సజ్దా సందేశం
జమాత్-ఎ-ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి మాట్లాడుతూ, సూరా అస్-సజ్దా మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుందని పేర్కొన్నారు. అహంకారం అనే గోడల మధ్య బందీలైపోతున్న మనిషికి ఈ సూరా ఒక కొత్త మలుపు చూపించి, దైవం ముందు తలవంచే వినయాన్ని నేర్పుతుందని ఆయన అన్నారు.
నిజామి తెలిపారు మనిషి గర్వపడే బుద్ధి, శక్తి అన్నీ సృష్టికర్త ముందు అల్పమైనవేనని గ్రహించడం అవసరం. “నేను, నాది, నా నిర్ణయం” అనే అహంభావం మనిషిని కిందకు లాగుతుందని, దైవం ముందు చేసే సజ్దా మాత్రం హృదయాన్ని పవిత్రం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాత్రివేళ అందరూ నిద్రలో ఉండగా, తన సుఖాన్ని వదిలి ప్రార్థనలో నిలిచే వ్యక్తి నిజమైన ధన్యుడు అని చెప్పారు. అలాంటి వ్యక్తిలో ఓర్పు (సబ్ర్), నమ్మకం (యకీన్) పెంపొందుతాయని, పాప మార్గంలో నడిచే జన సమూహంలోనూ సత్య మార్గం వైపు నడిచే ధైర్యం కలుగుతుందని వివరించారు.
దైవానికి నిజమైన బానిసత్వం స్వీకరించే వారినే సమాజానికి నాయకులుగా (ఇమామ్‌లు) దైవం నిలబెడతాడని ఆయన పేర్కొన్నారు. అణకువతో తలవంచడమే అసలైన ఉన్నత స్థితి (మేరాజ్) అని, వినయం మనిషిని ఆధ్యాత్మికంగా ఎదిగిస్తుందని అన్నారు.
“నువ్వు దైవం ముందు నీ అహంకారాన్ని సమర్పించి ‘అంతా నీవే’ అని మొక్కినప్పుడు నీ నిజమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవం ముందు వంగినవారినే ప్రపంచం గర్వంగా నిలబెడుతుంది” అని ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి పేర్కొన్నారు.

Post a Comment