స్మశానవాటికకు 10 గుంటల భూమి విరాళం – బీబీపేట ఉప్పల విద్యాసాగర్–పద్మ
బీబీపేట: గ్రామాభివృద్ధికి మరో మంచి ఉదాహరణగా నిలిచే విధంగా బీబీపేటలో ఆదర్శ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన ఉప్పల చంద్రకళ – చిన్న మల్లేశం జ్ఞాపకార్థం వారి సోదరుడు ఉప్పల విద్యాసాగర్–పద్మ దంపతులు స్మశానవాటిక కోసం 10 గుంటల భూమిని విరాళంగా అందజేశారు.
శనివారం గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఆ భూమిని అధికారికంగా అప్పగించారు. గ్రామంలో కొంతమంది కుటుంబాలకు కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు సరిపడా భూమి కూడా లేకపోవడం తమను కలచివేసిందని, ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాతలు తెలిపారు.
భవిష్యత్‌లో స్మశానవాటికలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ భూమి ఉపయోగపడనుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి దోహదపడేలా చేసిన ఈ విరాళాన్ని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏదుల్ల సాద్విక–సాయినాథ్, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ముందుకు వచ్చిన ఉప్పల కుటుంబానికి గ్రామపంచాయతీ పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది.
గ్రామ శ్రేయస్సు కోసం ఇలాంటి సేవాభావంతో ముందుకు వచ్చే వ్యక్తులు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Post a Comment