నాంపల్లి ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత

300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలంటూ ముట్టడి – పలువురు అరెస్టు


హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (ఇంటర్ బోర్డు) కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ముట్టడించింది.

ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుమారు 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే హాల్ టికెట్లు జారీ చేసి, పరీక్షలకు అనుమతి కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విద్యార్థులు కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. కొంతమంది నాయకులు కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా, ముందుగానే మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమై పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యపై అధికారులు స్పందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Blogger ఆధారితం.