అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యంతో కర్నూలు యువతి మృతి.. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో జరిగిన విషాద ఘటనలో కర్నూలుకు చెందిన జాహ్నవి (23) అనే యువతి పోలీస్ వాహనం ఢీకొని మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సియాటెల్ నగర యంత్రాంగం ఆమె కుటుంబానికి భారీగా రూ.262 కోట్ల పరిహారం ప్రకటించింది.
2023 జనవరిలో సియాటెల్ నగరంలో రోడ్డు దాటుతున్న సమయంలో జాహ్నవిని ఒక పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం ఆ కేసుకు సంబంధించిన ఆడియోలో ఒక పోలీస్ అధికారి కెవిన్ డవే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
“ఆమె చనిపోయింది… ఆమె చాలా సాధారణ వ్యక్తి… 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది” అంటూ నవ్వుతూ మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని మాత్రమే కాకుండా భారతీయ సమాజాన్ని కూడా కలచివేశాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన సియాటెల్ అధికారులు, పోలీస్ విభాగంపై చర్యలు తీసుకోవడంతో పాటు, జాహ్నవి కుటుంబానికి సుమారు రూ.262 కోట్ల (దాదాపు 32 మిలియన్ డాలర్లు) పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ పరిణామం అమెరికాలో పోలీస్ బాధ్యత, నిర్లక్ష్యం, జవాబుదారీతనం వంటి అంశాలపై మళ్లీ చర్చకు దారితీసింది. జాహ్నవి కుటుంబం ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ, తమ కుమార్తెను కోల్పోయిన బాధను ఇది భర్తీ చేయలేదని పేర్కొన్నట్లు సమాచారం.

Post a Comment