మున్సిపల్‌ ఎన్నికల వేళ కలకలం… మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మృతి

 

మున్సిపల్‌ ఎన్నికల వేళ కలకలం… మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మృతి

నారాయణపేట, ఫిబ్రవరి 10: మున్సిపల్‌ ఎన్నికల సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు బీజేపీ తరఫున కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహాదేవప్ప (48) మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపింది.

మక్తల్‌ మున్సిపాలిటీలోని చందాపూర్‌ గ్రామానికి చెందిన మహాదేవప్ప నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు సమాచారం అందింది. ఈ ఘటన వెనుక రాజకీయ వేధింపులు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రత్యర్థి నాయకులు పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారని, ఆ వేధింపులు తట్టుకోలేక మహాదేవప్ప ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన భార్య సత్తెమ్మ తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు స్పందిస్తూ, మంత్రి శ్రీహరి మరియు ఆయన అనుచరుల వేధింపులే మహాదేవప్ప మరణానికి కారణమని ఆరోపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రేపు పోలింగ్‌ జరగనుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

Blogger ఆధారితం.