రంజాన్ మాసంలో అవతరించిన ఖురాన్ మానవాళికి మార్గదర్శి: షేఖ్ అబ్దుల్ బాసిత్

రంజాన్ మాసంలో అవతరించిన ఖురాన్ మానవాళికి మార్గదర్శి: షేఖ్ అబ్దుల్ బాసిత్


కొత్తగూడెం, ఫిబ్రవరి 13: మానవ జీవిత మర్మాన్ని తెలియజేసే పవిత్ర గ్రంథం ఖురాన్ రంజాన్ మాసంలో అవతరించిందని షేఖ్ అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం జమా మస్జిద్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చావు–పుట్టుకల మధ్య మానవ జీవితానికి సార్థకతను తెలియజేసే దైవ గ్రంథమే ఖురాన్ అని ఆయన తెలిపారు. సృష్టికి సృష్టికర్త ఒక్కడే అని, మానవులందరూ సమానులే అని ఖురాన్ స్పష్టం చేస్తుందని చెప్పారు. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేవని, దైవభీతి కలిగి నైతిక విలువలతో జీవించే వారే నిజంగా గొప్పవారని ఖురాన్ బోధిస్తుందని వివరించారు.

రంజాన్ మాసం ఆత్మపరిశీలన, ఆత్మశుద్ధి కోసం ప్రత్యేకమైనదని షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. ఉపవాసాల ద్వారా ఆకలి బాధను అనుభవిస్తూ సమాజంలోని పేదలు, నిరుపేదల పట్ల సానుభూతి పెంపొందించుకోవాలని సూచించారు. మంచి మానవతా విలువలు పెంపొందించి, సమాజంలో సోదరభావం, శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలంటే ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపవాసాలను క్రమశిక్షణతో పాటిస్తూ సమాజంలో మంచిని ప్రోత్సహించి, చెడును నిర్మూలించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మౌలానా ఇర్ఫాన్, మస్జిద్ అధ్యక్షులు ఖమర్, సలీం, జాకీర్, నజీర్, మస్తాన్ సాబ్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.