ఉపవాసాల లక్ష్యం దైవభీతి – హాజీరా సదఫ్
ఖమ్మం, ఫిబ్రవరి 24: ఉపవాసాల ప్రధాన లక్ష్యం దైవభీతి పెంపొందించడం ద్వారా మానవుల్లో నైతిక విలువలను స్థిరపరచడం అని జమా ఆతే ఇస్లామీ హింద్ జిల్లా మహిళా పబ్లిక్ రిలేషన్ కన్వీనర్ హాజీరా సదఫ్ పేర్కొన్నారు.
జమా ఆతే ఇస్లామీ హింద్ సెంట్రల్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో ఉన్న తెలంగాణ మైనారిటీ ఖమ్మం గర్ల్స్ కాలేజీలో విద్యార్థినుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజీరా సదఫ్ మాట్లాడుతూ, ఉపవాసం ద్వారా మనిషిలో దైవభీతి, నిగ్రహ శక్తి, సహనం పెంపొందుతాయని తెలిపారు.
ఉపవాసం అన్ని మతాలవారు ఆచరించే ఆధ్యాత్మిక సాధన అని ఆమె చెప్పారు. ఉపవాసం పాటించడం వల్ల ఆకలి బాధను అనుభవించి, ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే మనసు పెరుగుతుందని వివరించారు. ఉపవాసం మనిషిని సంస్కరిస్తుందని, సంస్కారవంతుల ద్వారానే సత్సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఉపవాసి తన మనోవాంఛలను అదుపులో ఉంచుకొని సమాజంలో మంచి విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతిమ దైవగ్రంథమైన ఖుర్‌ఆన్ అవతరణ వల్లనే రంజాన్ నెలకు విశిష్టమైన ప్రాధాన్యం లభించిందని, అది సమస్త మానవాళికి మార్గదర్శకమని అన్నారు. ఉపవాసం వల్ల కలిగే శాస్త్రీయ ప్రయోజనాల గురించి కూడా ఆమె వివరించారు.
అనంతరం కో-కన్వీనర్ జహీరా ఫాతియా మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. కొత్త విషయాలపై కంటే ఇప్పటికే చదివిన అంశాలను పునర్విమర్శ చేయడం వల్ల గుర్తుంచుకోవడం సులభమవుతుందని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమై ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకూ, తల్లిదండ్రులకూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్, సభ్యులు నస్రీన్, సుమయ్య తరున్నం, కళాశాల ప్రిన్సిపాల్ అఖిల, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఖాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామి (ఉపాధ్యక్షుడు, జమాత్ ఏ ఇస్లామీ హింద్; టెమ్రీస్ కౌన్సిలర్; హింద్ మజ్దూర్ సభ – హెచ్‌ఎంఎస్ జాతీయ కార్యదర్శి) అభినందించారు.

Post a Comment