రావి నారాయణ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

రావి నారాయణ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పిస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం తగిన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి గారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అన్ని వర్గాలతో చర్చించి, మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని గౌరవం పెంచే చర్యలు చేపడతామని తెలిపారు.

‘తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం–2025ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “అరాచక శక్తులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేదల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి” అని కొనియాడారు.

‘బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి’ అంటూ తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి వంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేసిన నాయకుడని గుర్తు చేశారు. దేశంలో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గారికంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఘనత రావి నారాయణ రెడ్డి గారికే దక్కిందని తెలిపారు. అంతేకాదు, తొలి పార్లమెంట్ భవనాన్ని నెహ్రూ గారు రావి నారాయణ రెడ్డి గారితోనే ప్రారంభింపజేశారని చెప్పారు.

60 ఏళ్ల వయసులోనే రాజకీయ పదవులకు, పార్టీకి దూరంగా ఉండి ప్రజలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప నేతగా రావి నారాయణ రెడ్డి గారిని సీఎం ప్రశంసించారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఆయనకు తగిన గౌరవం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు.

జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గారికి జాతీయ పురస్కారం దక్కడం సముచితమని సీఎం పేర్కొన్నారు. “తొలితరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి లాంటి వారు, మలితరంలో ఎస్. జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి స్ఫూర్తినిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సుదర్శన్ రెడ్డి గారి పాత్ర చిరస్మరణీయం. వారి అనుభవం పరిపాలనకు దోహదపడుతోంది” అని అన్నారు.

హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.