నారాయణ స్కూల్‌లో మంటలు.. సురక్షితంగా బయటపడ్డ విద్యార్థులు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (2026): హైదరాబాద్ సిటీ కూకట్‌పల్లి సమీపంలోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్ క్యాంపస్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ సెల్లార్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడటంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సెల్లార్ ప్రాంతం నుంచి పొగలు రావడాన్ని గమనించిన వెంటనే స్కూల్ యాజమాన్యం అప్రమత్తమై విద్యార్థులందరినీ బయటకు తరలించింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Post a Comment