తెలంగాణలో మరో వనదుర్గాభవాని మాత మహాజాతర ఏర్పాట్లు పూర్తి

ఈనెల 15 నుంచి 17 వరకు ఏడుపాయల వనదుర్గాభవాని మాత మహాజాతర


తెలంగాణలో మేడారం జాతర తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించే జాతరగా గుర్తింపు పొందిన ఏడుపాయల వనదుర్గాభవాని మాత మహాజాతరకు షెడ్యూల్ విడుదలైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల క్షేత్రంలో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి మధ్యలో వెలిసిన వనదుర్గమ్మ ఆలయం అపారమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

జాతరలో భాగంగా తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గమ్మను దర్శించుకుంటారు. రెండో రోజు ఫిబ్రవరి 16న అత్యంత కీలకమైన బండ్ల ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎడ్లబండ్లతో ఆలయ ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజు ఫిబ్రవరి 17న రథోత్సవంతో మహాజాతర ముగియనుంది.

ఈ జాతరకు మెదక్ జిల్లా మాత్రమే కాకుండా సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంజీరా నదిలో స్నానాల కోసం సరిపడా నీటిని విడుదల చేయడం, ఘాట్ రోడ్ల మరమ్మతులు, నదిలో బారికేడ్ల ఏర్పాటు, ఆలయ పరిసరాల్లో తాగునీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకపోకలకు సౌకర్యంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భారీ పోలీసు బందోబస్తు కల్పించనున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.