వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్..
చేర్యాల: మద్దూరు, ధూల్మిట్ట మండలాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు.
శనివారం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గుండెల్లి రమేష్ (32), మాసంపల్లి రాములు (32)లు గత నెలలో మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో భార్యాభర్తలను బెదిరించి 3 తులాల బంగారు పుస్తెల తాడు అపహరించారని తెలిపారు. అలాగే జాలపల్లి గ్రామంలో ఓ ఇంట్లో చొరబడి 10 తులాల వెండి, రూ.5 వేల నగదును దోచుకున్నట్లు పేర్కొన్నారు. బైరాన్‌పల్లి గ్రామంలో ఓ మహిళ మెడలోని బంగారాన్ని లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఏసీపీ వివరించారు.
నిందితులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ చెప్పారు. ఈ సమావేశంలో చేర్యాల సీఐ భానోతు రమేష్ నాయక్, ఎస్సైలు నవీన్ కుమార్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment