హనుమకొండ జిల్లాలో భావోద్వేగ దృశ్యం – కూతురు కాళ్లు మొక్కిన వార్డు సభ్యుడు
పరకాల మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయనకు మొత్తం 584 ఓట్లు లభించగా, 207 ఓట్ల భారీ మెజారిటీతో వార్డుసభ్యుడిగా గెలుపొందారు.
గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం కౌంటింగ్ హాల్ నుండి బయటకు వచ్చిన శ్రీనివాస్ నేరుగా తన కోసం ఎదురుచూస్తున్న తన చిన్నారి కూతురు సహస్ర వద్దకు వెళ్లారు. ఆమె రెండు కాళ్లకు నమస్కరించి మొక్కారు. అనంతరం ఆమెను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది.
శ్రీనివాస్ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుంటూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినాన తన కూతురు సహస్ర పుట్టడం తనకు అదృష్ట సూచికగా భావిస్తున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఆమెను ముద్దుగా “బంగారు తల్లి” అని పిలుచుకుంటారని చెప్పారు. అందుకే గెలుపొందిన వెంటనే తన విజయానికి కారణం తన కూతురేనని భావించి ఆమె కాళ్లు మొక్కినట్లు వారు వివరించారు.
ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమై, తండ్రి ప్రేమకు ప్రతీకగా నిలిచింది.

Post a Comment