బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ Amber Kishore Jha తెలిపారు.
సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో వీధులు, రోడ్లపై అసభ్య పదజాలంతో ప్రవర్తించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు.
ఈ నిషేధాజ్ఞలు 01-03-2026 నుండి 01-04-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీజే సౌండ్స్, డ్రోన్లపై నిషేధాజ్ఞల పొడిగింపు
మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో భారీ శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు కమిషనర్ తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా మరియు శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ కోసం డీజే సౌండ్స్ వినియోగిస్తున్నట్లు గమనించామని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
ఈ నిషేధాజ్ఞలు కూడా 01-03-2026 నుండి 01-04-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి పొడిగించే అవకాశం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిటీ పోలీస్ యాక్ట్ అమలు
రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యాక్ట్ 2016లోని సెక్షన్ 7(1), సెక్షన్ 22(1)(a) నుండి (f), సెక్షన్ 22(2)(a) & (b), సెక్షన్ 22(3), సిటీ పోలీస్ యాక్ట్ 1348 నం. IX ఫసలీ, సెక్షన్ 30, పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం 01-03-2026 ఉదయం 6:00 గంటల నుండి 01-04-2026 ఉదయం 6:00 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈ కాలంలో కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
బంద్‌ల పేరిట సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించేందుకు ఒత్తిడి చేయడం లేదా బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.

Post a Comment