మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం సన్నాహాలు!
హైదరాబాద్ : మార్చి 24: మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని చురుగ్గా కసరత్తు కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మార్పుల వల్ల లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543 నుంచి సుమారు 816కు పెరిగే అవకాశముంది. అందులో దాదాపు 273 స్థానాలు మహిళలకు కేటాయించవచ్చని అంచనా.
ఈ బిల్లులపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్డీఏతో పాటు కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఒకవేళ అంగీకారం కుదిరితే, ఈ వారంలోనే బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే మహిళా రిజర్వేషన్ చట్టం 2023లో రాజ్యాంగానికి 106వ సవరణగా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆ చట్టం ప్రకారం కొత్త జనాభా గణన (Census) అనంతరం మాత్రమే అమలు జరగాల్సి ఉంది.
కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త జనగణన కోసం వేచి ఉండకుండా, 2011 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలని యోచిస్తోంది. దీంతో ప్రక్రియ వేగవంతమై, మహిళా రిజర్వేషన్లు త్వరగా అమల్లోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ సమావేశంలో ప్రవేశపెట్టే రెండు బిల్లుల్లో ఒకటి ‘నారీ శక్తి వందన్’ చట్టంలో సవరణలకు సంబంధించినది కాగా, మరొకటి డీలిమిటేషన్ చట్టంలో మార్పులకు సంబంధించినది. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Post a Comment