సీసా ఒకటి.. మందు మరోటి.. కంగుతిన్న మందుబాబు
శంకరపట్నం : వేసవికాలం వచ్చిందంటే బీర్ అమ్మకాలు పెరగడం సహజం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కింగ్ ఫిషర్ లైట్ బీర్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ మందుబాబు తనకు ఇష్టమైన కింగ్ ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేయగా ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.
బీర్ తాగేందుకు సిద్ధమవుతున్న సమయంలో సీసా పై రెండు కంపెనీల పేర్లు కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఒకవైపు కింగ్ ఫిషర్ లైట్ అని ఉండగా, మరోవైపు టుబర్గ్ బీర్ పేరు కనిపించడం అతనిని అయోమయంలోకి నెట్టింది. తాను కొనుగోలు చేసింది ఒక బ్రాండ్ అయితే, సీసాపై మరో బ్రాండ్ పేరు కనిపించడం గమనార్హం.
ఈ విషయం పై సందేహంతో వెంటనే వైన్స్ షాపు వద్దకు వెళ్లి ప్రశ్నించగా, తమకు దీనితో ఎలాంటి సంబంధం లేదని, సరఫరా అయిన బీర్లను అలాగే విక్రయిస్తున్నామని దుకాణదారులు చెప్పి చేతులు దులుపుకున్నారు.
అయితే ఈ ఘటనను అక్కడ ఉన్న ఇతరులకు చూపించడంతో వారంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని బీర్లపై ఇతర కంపెనీల స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసే సమయంలో ఉత్పత్తి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment