కాంట్రాక్టు కార్మిక సంఘాల దీక్షా శిబిరం భగ్నం – ఐటీసీ ఎదుట భారీ నిరసన
బూర్గంపహాడ్, మార్చి 26: కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గురువారం ఉదయం ఐటీసీ సంస్థ ఎదుట కాంట్రాక్టు కార్మికులు భారీగా నిరసనకు దిగారు.
13వ వేతన ఒప్పందానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే 14వ వేతన ఒప్పందాన్ని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో కలిసి చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల క్రితం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి 9 గంటల తరువాత ఐటీసీ యాజమాన్యం ఒత్తిడితో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో శిబిరాన్ని కూల్చివేసినట్లు జేఏసీ నేతలు ఆరోపించారు. శిబిరంలో ఉన్న కార్మిక సంఘాల జెండాలను కూడా చెల్లాచెదురుగా పడేశారని తెలిపారు.
దీంతో ఆగ్రహించిన కార్మికులు గురువారం ఉదయం ఐటీసీ ఎదుట ఏ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ సమయాల్లో గంట పాటు నిరసన తెలిపారు. అనంతరం నిర్వహించిన గేటు మీటింగ్‌లో జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, యాకూబ్ పాషా మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటన ఉండటంతో పోలీసు శాఖ ముందుగానే శిబిరాన్ని తొలగించాలని సూచించినప్పటికీ, తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ యాజమాన్యం ఒత్తిడితోనే శిబిరాన్ని భగ్నం చేశారని ఆరోపించారు.
శ్రీరామ నవమి అనంతరం తిరిగి దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారం వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సభ్యులు వర్ణగొండ వీరన్న, సింగారపు సతీష్, కదల వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మేకల శేషమ్మ, రామశెట్టి లక్ష్మి, వీరంరెడ్డి సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment