కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్న సీఎం రేవంత్
న్యూఢిల్లీ, మార్చి 04: తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy న్యూఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shahతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే అమిత్ షా కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు భద్రతా అంశాలు, ముఖ్యంగా మావోయిస్టు కార్యకలాపాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం వెంట తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ ఉన్నారు.
ఇటీవల పలువురు మావోయిస్టు అగ్రనేతలు — దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహరెడ్డి తదితరులు — తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ముగింపు దశకు చేరుకున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి Muppala Lakshmana Rao (గణపతి) ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నారనే వార్తలు వెలువడగా, ఆయనను స్వదేశానికి తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు ప్రచారం సాగుతోంది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలని ఆయన సోదరుడు కూడా ఇప్పటికే మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఆసిఫాబాద్ అడవుల్లో జరిగిన లొంగుబాటులో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సమక్షంలో డీజీపీతో పాటు ఉన్న ఉన్నతాధికారులను అమిత్ షా స్వయంగా అభినందించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Post a Comment