ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి జిల్లా అధికారులతో సమగ్ర దిశానిర్దేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 6 నుండి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.

కార్యాచరణ దశల వారీ వివరాలు:

మార్చి 6 – మార్చి 15:

పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం పై ప్రత్యేక డ్రైవ్. తడి–పొడి చెత్త వేరు సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

ఏప్రిల్ 6 – ఏప్రిల్ 11:

ఆరోగ్యం – ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు కార్యక్రమం కింద ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణీలు మరియు చిన్నారులకు ప్రత్యేక పర్యవేక్షణ.

ఏప్రిల్ 13 – ఏప్రిల్ 18:

“సురక్షితంగా చేరుకోండి (Arrive Alive)” కార్యక్రమం కింద రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, హెల్మెట్–సీట్‌బెల్ట్ వినియోగంపై తనిఖీలు.

ఏప్రిల్ 20 – ఏప్రిల్ 25:

సంక్షేమ కార్యక్రమాల సమీక్ష – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మరియు ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు స్థితి పరిశీలన.

ఏప్రిల్ 27 – మే 2:

పిల్లల భద్రత – డ్రగ్స్‌కు నో కార్యక్రమం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా అమలు.

మే 4 – మే 9:

రైతుల అంశంపై వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖల సమన్వయంతో సాగు సలహాలు, ఎరువులు–విత్తనాల లభ్యత, సాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా పర్యవేక్షణ.

మే 11 – మే 16:

విద్య అంశంపై పాఠశాలల మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన నాణ్యతపై సమీక్షలు.

మే 18 – మే 23:

యువత మరియు క్రీడలు – క్రీడా పోటీలు, యువజనోత్సవాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు.

మే 25 – మే 30:

మహిళల సాధికారత – స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, రుణాల సద్వినియోగం.

జూన్ 1 – జూన్ 12:

పర్యావరణ పరిరక్షణ – వృక్షారోపణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు కార్యక్రమాలు.

ఈ 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఐదు దశల్లో అమలు చేయబడుతుందని తెలిపారు. మార్చి 6న ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో గౌరవ మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని వెల్లడించారు.

మార్చి 6 నుండి 16 వరకు నిర్వహించనున్న పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక దిశానిర్దేశం చేస్తూ ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రహదారుల వెంట చెత్త నిర్మూలన చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీలలో 100 శాతం పన్ను వసూళ్ల లక్ష్య సాధనకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

మహిళా సంఘాల రుణాల పంపిణీ లక్ష్యాలను పూర్తిగా సాధించాలని, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శ్రీనిధి రుణాల 100 శాతం వసూళ్లపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను నిరంతర పర్యవేక్షణలో ఉంచి వసతి గృహాల్లో భోజన నాణ్యత, పారిశుద్ధ్య పరిస్థితులను ప్రతిరోజూ తనిఖీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంటుందని స్పష్టం చేశారు.

వార్డు అధికారులు తమ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు స్థితి, గ్రౌండ్ లెవెల్ పురోగతి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త వాహనాలు, డ్రైనేజీ విస్తరణ వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఈ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాల పూర్తి వివరాలను రోజువారీ ప్రగతి నివేదికల రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా పురోగతి, సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర వివరాలు సమగ్రంగా నివేదికలో పొందుపరచాలని సూచించారు. కార్యక్రమం అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నలిని తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.