తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా పరిస్థితులపై సీఎం ప్రధానికి సమగ్ర నివేదిక
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కు సమగ్ర నివేదిక సమర్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశాలు ప్రధానంగా చర్చించబడ్డాయి.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా మరియు విక్రయాలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు.
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట దాడులు నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యతా క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పెట్రోల్ బంక్‌లో ఉన్న నిల్వలు, వినియోగ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా ఉండగా, అవసరానికి సరిపడా నిల్వలు కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఇంధన కొరతపై అపోహలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా, శిలాజ ఇంధనాలపై ఆధారపడకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ఈవీ వాహనాలపై 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్పిడి చేసే ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఇక భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా దీర్ఘకాలిక ఇంధన భద్రత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Post a Comment