దక్షిణ అయోధ్య భద్రాచలంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
భద్రాద్రి జిల్లా దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. వేదమంత్రాల నడుమ, భక్తుల జయజయధ్వానాలతో ఈ దివ్య కళ్యాణం ఘనంగా సాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సంప్రదాయం ప్రకారం ఈ కానుకలను సమర్పించడం విశేషం.
కళ్యాణ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణం భక్తులకు కన్నులపండువగా నిలిచింది. ఆలయ పరిసరాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. భక్తుల కోసం ప్రత్యేకంగా తాగునీరు, మజ్జిగ, ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లు కూడా నిర్వహించారు.
ముందుగా ఐటీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయానికి చేరుకుని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ దివ్య వేడుకతో భద్రాచలం భక్తి పరవశంతో కళకళలాడగా, శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.

Post a Comment