ఒంగోలులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా.. అన్నదానంతో భక్తుల సందడి
ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్‌లో శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కర్నూల్ బైపాస్ రోడ్డు వద్ద శ్రీ వారహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతృత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దైవ దర్శనం చేసుకున్నారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా శ్రీ వారహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం కూడా సుమారు 120 కుటుంబాల సభ్యులు కలిసి వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి, భక్తులకు సత్కారంగా భోజనం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో దేవినేని సురేష్, చింతలబోయిన రాజేష్ కుమార్, భూపతి సురేష్, పసుపులేటి వెంకటేశ్వర్లు, ఉప్పు రవితేజ తదితర ప్రముఖులు పాల్గొని సేవా కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.
భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Post a Comment