“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” – పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం

“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” – పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం


దమ్మపేట మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృత పర్యటన నిర్వహిస్తూ తహసీల్దార్ కార్యాలయం మరియు పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ముఖ్యంగా మధ్యాహ్న భోజన నాణ్యతపై సమగ్రంగా ఆరా తీశారు.

మొదటగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, కార్యాలయంలోని విభాగాలను పరిశీలించి దరఖాస్తుల పరిష్కార విధానంపై అధికారులను ప్రశ్నించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డుల వంటి దరఖాస్తుల పురోగతిని తెలుసుకున్నారు. దరఖాస్తులను నిర్దిష్ట గడువులోనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. “మీ సేవ” రుసుముల వివరాలను కార్యాలయంలో స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

భూ సమస్యలు, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలు మండల స్థాయిలోనే పరిష్కారం కావాల్సి ఉండగా, ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి ఎందుకు దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తోందని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమస్యలను స్థానికంగానే వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డు గదిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, వ్యవసాయం, పోలీస్ శాఖల పనితీరును సమీక్షించారు. గ్రామసభల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేయాలని, వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం దమ్మపేట తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్ బగారా రైస్ అందించాల్సి ఉండగా అది అందుబాటులో లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు అందించవలసిన ఆహారాన్ని ప్రదర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే ప్రదర్శించాలని ఆదేశించారు.

విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్, నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్మేకర్ కూర సరిగా ఉడకకపోవడం, రుచి మరియు నాణ్యత లోపించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. భవిష్యత్తులో నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశంలో కుళాయిలకు ట్యాప్‌లు లేక నీరు వృథా అవుతున్న పరిస్థితిని గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

తరువాత మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించిన కలెక్టర్, అక్కడ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి కూరగాయలు, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. వంటశాలలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు, భద్రతా చర్యలపై ఆరా తీసి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డెన్ దుర్గ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.