ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి

 

ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు పెద్ద ఎత్తున నిర్వహించాలి

ప్రజా పాలన–ప్రజా ప్రణాళికపై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రంలో ప్రజా పాలన–ప్రజా ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం ప్రజాభవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామసభ ప్రారంభంలో ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చదివి వినిపించాలని తెలిపారు.

రైతు భరోసా లబ్ధిదారుల పేర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను సాధ్యమైనంతవరకు గ్రామసభల్లో ప్రకటించాలని ఆదేశించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు జూన్ 2 నుంచి అమలు చేయనున్న కొత్త పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు.

ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం అమలు చేయనున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం కార్యక్రమం కింద మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మరో మూడు రోజులపాటు రాగి జావ అందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. అలాగే ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయాన్ని కూడా ప్రచారం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమాల ప్రచారంలో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్న నిధుల వివరాలను గ్రామసభల్లో వెల్లడిస్తూ, ప్రతి గ్రామానికి ఎంత నిధులు వచ్చాయో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.

ప్రజా పాలన కార్యక్రమం పురోగతిపై చీఫ్ సెక్రటరీ మరియు ప్రణాళిక శాఖ నిరంతరం జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం సేకరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగ పురోగతిపై కూడా దృష్టి సారించి ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Blogger ఆధారితం.