ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభల నిర్వహణ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రాష్ట్రంలో ప్రజాపాలన ప్రతిబింబించే విధంగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం అమలు, అలాగే ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు ఒకే విధానంలో నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులను గ్రామసభలకు ఆహ్వానించాలని సూచించారు. గ్రామసభలో ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపుసెట్లు వంటి పథకాల లబ్ధిదారులను గ్రామసభల్లో మాట్లాడేలా చేయాలని సూచించారు. జూన్ 2 నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవన భీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, పాలు, రాగి జావా పంపిణీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
సీఎస్ కే. రామకృష్ణా రావు వ్యాఖ్యలు
సీఎస్ కే. రామకృష్ణా రావు మాట్లాడుతూ, మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. అదే స్పూర్తితో గ్రామ, వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్లకు ఆదేశించారు.
గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, గ్రామ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డుల్లో కూడా ఇలాంటి సభలు నిర్వహించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ వ్యాఖ్యలు
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించి వారి నుంచి సూచనలు స్వీకరించాలని తెలిపారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలను నిర్వహించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సభలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి, ముందస్తు షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు.
గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించి, జాబితాలను ప్రజలకు చదివి వినిపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, వైద్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత, డీపీఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment