రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: ఏసీపీ మడత రమేష్

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: ఏసీపీ మడత రమేష్


పెద్దపల్లి జిల్లా, ఏప్రిల్ 13: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని రామగుండం ఏసీపీ మడత రమేష్ అన్నారు.

సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఏసీపీ రమేష్, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, “అరైవ్ అంటే ఇంటి నుండి బయలుదేరడం… అలైవ్ అంటే అదే సురక్షితంగా తిరిగి ఇంటికి చేరడం” అని తెలిపారు. మంథని మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని తెలిపారు.

అదనంగా, ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ శ్రీనివాస్, మల్లయ్య గౌడ్, వంశీకృష్ణ, అనిల్ కుమార్, రామకృష్ణతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.