“తండ్రిని ఏడిపించవద్దు” అన్న కేటీఆర్ వ్యాఖ్య…
తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు చూస్తుంటే, ఒకప్పుడు అజేయంగా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంతర్గత సంక్షోభంతో కుదేలవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. “తండ్రిని ఏడిపించవద్దు” అని కేటీఆర్ చేసిన వ్యాఖ్య, ఒక నాయకుడి ధైర్యాన్ని కాకుండా ఆయన బేలతనాన్ని బహిర్గతం చేస్తోంది. కేసీఆర్ వేదనలో ఉన్నాడనే విషయాన్ని స్వయంగా వారి మాటల ద్వారానే ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ ఆ వేదనకు కారణం ఎవరు? పార్టీని ఈ దుస్థితికి నెట్టింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే వేళ్లు నేరుగా కేటీఆర్ వైపు చూపుతున్నాయి.
ఏడాది కిందటే కవిత ఇచ్చిన హెచ్చరికలు ఇప్పుడు నిజమవుతున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ చుట్టూ “దయ్యాలు చేరాయి”, పార్టీని మాయ చేస్తున్నాయని ఆమె అప్పుడే చెప్పినా… ఆ మాటలను పట్టించుకోకపోవడం ఇప్పుడు పెద్ద తప్పిదంగా మారింది. ఆ “దయ్యాలు” ఎవరు? పార్టీని తమ స్వార్థాలకు వాడుకుంటున్న గుంటనక్కలే కాదా? వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని కట్టుదిట్టంగా నడిపించాల్సిన కేటీఆర్… ఆ బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేతగానితనాన్ని దాచిపెట్టేందుకు, బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కవితపై నెపం మోపడం మరింత విచారకరం.
ఇప్పుడీ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎవరి చేతిలో ఉంది? కేసీఆర్ చేతిలోనా? కేటీఆర్ చేతిలోనా? లేక కొందరు స్వార్థపరుల గుప్పిట్లో బందీ అయిందా? అన్న సందేహం సాధారణ కార్యకర్తలకే కాకుండా ప్రజలకూ కలుగుతోంది. తన మానసపుత్రికగా భావించి నిర్మించిన ఉద్యమ పార్టీని ఈ స్థితికి చేరడం కేసీఆర్‌కు ఎంతటి మనోవేదన కలిగిస్తుందో అర్థం చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితికి ప్రధాన కారణం కేటీఆర్ అనే విమర్శను విస్మరించలేం.
తమ స్వార్థాల కోసం పార్టీని బలి చేసేందుకు కూడా వెనుకాడరని, అవసరమైతే కేసీఆర్, కేటీఆర్‌లను కూడా పక్కకు నెట్టేస్తారని కవిత ముందే హెచ్చరించారు. అయినా ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం ఇప్పుడు పెద్ద రాజకీయ తప్పిదంగా మారింది. “జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు కాలేరు” అనే వ్యాఖ్య ద్వారా కవిత పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేకపోవడమే బయటపడింది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి — కవిత జైలు జీవితం వ్యక్తిగత కారణాల కోసం కాదు, పార్టీ కోసం అనేది స్వయంగా కేసీఆరే చెప్పిన విషయం. అటువంటి త్యాగాన్ని చిన్నచూపు చూడడం ఎంతవరకు సమంజసం?
ఒక ఆడబిడ్డ తన తండ్రిని రాజకీయంగా కాపాడేందుకు జైలు జీవితం గడిపితే… అది త్యాగం కాదా? లేక అది కూడా రాజకీయ లెక్కలకే పరిమితమా? ఇప్పటికే కేసీఆర్ తన వారసత్వంపై తీసుకున్న నిర్ణయంపై ఆలోచనలో పడ్డారనే చర్చలు వినిపిస్తున్నాయి. కవితను కాకుండా కేటీఆర్‌ను వారసుడిగా ప్రకటించడం తప్పు అయిందేమో అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. కేటీఆర్ వైఫల్యంతోనే కుటుంబంలో విభేదాలు పెరిగి, పార్టీ కూడా చీలిక దశలోకి చేరిందన్న అభిప్రాయం బలపడుతోంది.
కవిత పార్టీ స్థాపనను వ్యక్తిగత నిర్ణయంగా చూపించడం… ఆమె 20 ఏళ్లుగా చేస్తున్న సామాజిక, రాజకీయ ఉద్యమాలను అవమానించడమే. సమన్యాయం కోసం, సంపూర్ణ అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోలేకపోవడం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం. ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న — బీఆర్ఎస్ పార్టీ అసలు దారి తప్పిందా? ఒకప్పుడు ఉద్యమ పార్టీగా నిలిచిన ఈ సంస్థ… ఇప్పుడు కేవలం కమీషన్ల రాజకీయాలకు పరిమితమైందా? ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇదేనా?
ఈ నేపథ్యంలో, “సంపూర్ణ వికాస తెలంగాణ” అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కవితకు ప్రజల్లో మద్దతు పెరగడం సహజమే. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు… నిజాయితీ నాయకత్వం కోరుకుంటున్నారు. మొత్తానికి, ఈ సంక్షోభం బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు. ఇప్పుడు అయినా introspection చేసుకుని మార్పు దిశగా అడుగులు వేయకపోతే… ఈ పతనం ఆపడం ఎవరి వశంలోనూ ఉండదు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు పలికి నట్లు ఉన్నాయి....రియాజ్ అహ్మద్
.jpg)
Post a Comment