గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు… పశువులకు తీవ్ర గాయాలు
మంచిర్యాల జిల్లా, జన్నారం: జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పేలుడు పరికరాలు అమర్చినట్లు సమాచారం.
గ్రామానికి చెందిన కాపరులు తమ పశువులను మేత కోసం నది ఒడ్డుకు తీసుకెళ్లగా, మేత కోసం తిరుగుతున్న పశువులు ఆ పేలుడు పరికరాలను తినడంతో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో పలు పశువులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాటిని సమీప వెటర్నరీ వైద్యుల వద్దకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పద్ధతులు ఉపయోగించడం వల్ల నిరపరాధ పశువులు బలవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ, పోలీసు అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో పేలుడు పరికరాలు తినడంతో నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment