అఘాత్యాలకు పాల్పడొద్దు… సమ్మె విరమించి విధుల్లో చేరండి

సమ్మె విరమించి విధుల్లో చేరండి ఆర్టీసీ కార్మికులకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు విజ్ఞప్తి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్టీసీ కార్మికులు ఎటువంటి అఘాత్యాలకు పాల్పడకుండా సమ్మెను విరమించి తిరిగి విధుల్లో చేరాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 సమస్యలను ఇప్పటికే పరిష్కరించారని, మిగిలిన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కొందరు యూనియన్ నాయకులు, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కావాలనే కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వారి మాటలు నమ్మి ఆవేశానికి లోనవ్వకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు.

సమ్మె కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. గతంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోందని చెప్పారు.

మహిళలకు ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటాన్ని చూసి ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయని, కొందరిని రెచ్చగొట్టి సమ్మెకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

మిగిలిన మూడు అంశాలపై కూడా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని, ఎవరూ తొందరపడి అఘాత్యాలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయవద్దని నాగా సీతారాములు పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.