పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఎన్సీసీపీఏ రాష్ట్ర సదస్సు డిమాండ్

పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఎన్సీసీపీఏ రాష్ట్ర సదస్సు డిమాండ్


హైదరాబాద్: పెన్షనర్లు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జాతీయ పెన్షనర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీపీఏ) రాష్ట్ర స్థాయి సదస్సు డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాప్రా గౌరవాధ్యక్షులు ఎంఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.

సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా 1972 నుండి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను నిర్వీర్యం చేసే విధంగా ఉన్న పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే 8వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను సవరించాలన్నారు.

బీఎస్ఎన్ఎల్, బ్యాంకులు, కోల్, ఎల్ఐసీ, జీఐసీ వంటి సంస్థల పెన్షన్లను నవీకరించడంతో పాటు కనీస ఈపీఎస్ పెన్షన్‌ను రూ.9,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెన్షన్ కమ్యూటేషన్ విలువపై కోత కాలాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించాలని సూచించారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల మేరకు 65, 70, 75 సంవత్సరాల వయస్సుల వారికి అదనపు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌పీఎస్, యూపీఎస్ పథకాలను రద్దు చేసి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని, సీనియర్ సిటిజన్లకు ప్రయాణ రాయితీలు తిరిగి అమలు చేయాలని కోరారు.

పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని, 50 శాతం డీఏ, డీఆర్‌ను బేసిక్ పెన్షన్‌లో విలీనం చేయాలని, 18 నెలల పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సదస్సులో ఎన్సీసీపీఏ రాష్ట్ర అధ్యక్షులు సగరం శ్రీధర్, ప్రధాన కార్యదర్శి నామాల సోమయ్య, జాతీయ నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి, ఏఐటీయూసీ సంటి బాల్‌రాజ్, సీఐటీయూ ప్రసాద్, తాప్రా రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు నరహరి, డాక్టర్ లింగా అరుణ, జనార్ధన్ రెడ్డి, వి. కృష్ణ మోహన్ తదితరులు ప్రసంగించారు.

వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిపి సుమారు 500 మంది హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు, కన్సల్టేషన్లు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Blogger ఆధారితం.